అరవై ఆరు వేల రైతు కుటుంబాలను ఆదుకున్నాం..రెండున్నరేళ్లలో రైతు బీమా కింద రూ.3,301.90 కోట్లు జమ: మంత్రి తుమ్మల

అరవై ఆరు వేల రైతు కుటుంబాలను ఆదుకున్నాం..రెండున్నరేళ్లలో రైతు బీమా కింద రూ.3,301.90 కోట్లు జమ: మంత్రి తుమ్మల
  • ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీకి మొత్తం ప్రీమియంను చెల్లించామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 66,038 మంది రైతుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయని ఆయన వెల్లడించారు. చనిపోయిన రైతు కుటుంబాల నామినీల అకౌంట్లలో మొత్తం రూ.3,301.90 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు. రైతు బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని మంత్రి అన్నారు.

రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి కాంప్రమైజ్ కాదని పేర్కొన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీకి పే చేయాల్సిన మొత్తం వార్షిక ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా చెల్లించిందని తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్ నుంచి ఆ ఇయర్ ఎండ్ వరకు 20,090 రైతు కుటుంబాలకు రూ.1,004.50 కోట్ల బీమా సాయం అందించారు. అలాగే 2024లో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు చెల్లించారు.

2025---–26 ఆర్థిక సంవత్సరంలో 20,087 కుటుంబాలకు రూ.1,004.35 కోట్ల బీమా సాయం అందించినట్లు తుమ్మల వివరించారు. 2025-–26 సంవత్సరానికి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు రైతు బీమా పథకంలో రిజిస్టర్ చేసుకున్నారని, వీరందరికీ వర్తించేలా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీకి పే చేయాల్సిన రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియాన్ని ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని మంత్రి పేర్కొన్నారు. దీంతో రైతు చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక చేయూత అందించే అవకాశం కలిగిందన్నారు.